Sep 13, 2013

రంగనాయకమ్మ కామెడీ: (Original by Ramadandu)

(Copy-Pasted from a post written by Ramadandu)

రంగనాయకమ్మ:





దశరథుడు కైక కోరిన వరాలకు అదిరిపడి "భర్త ముద్దుగా వరాలు కోరుకోమంటే మాత్రం చక్కగా భర్తకు సంతోషం కలిగించే వరాలు కోరుకోవాలి గానీ భర్తకు నష్టం కలిగించే వరాలు కోరుకోవచ్చునా?" అని విసుక్కున్నాడు. చక్కగా భార్యలు చీరలో, నగలో కోరుకుంటే దశరథ మహారాజు గారు వాటిని తక్షణం తెప్పించి ఇచ్చి తమ కీర్తికాంతులు నలుదిశలా వెదజల్లేవారే, అంత కీర్తి తప్పిపోయినందుకు మహరాజు భార్య మీద మండిపడ్డాడు "దుష్టురాలా! నీ వరాల్ల నేను రాముణ్ణి అడవికి పంపితే ఆ దు:ఖంతో నేను చచ్చిపోతాను. నా కోసం రాముడు చచ్చిపోతాడు, లక్ష్మణుడు చచ్చిపోతాడు. భరతుడు చచ్చిపోతాడు. శతృఘ్నుడు చచ్చిపోతాడు రాణులందరూ చచ్చిపోతారు" అంటూ తనతోపాటూ చచ్చిపోయే వాళ్ళ పట్టీ చదువుతాడు. కానీ తమాషా ఏమంటే దశరథుడు చచ్చిపొయిన తర్వాత ఒక్కరన్నా చచ్చిపోలేదు. పైగా అయోధ్యలో సందడి ఇంకా ఎక్కువ అయ్యింది. "ముసలి రాజు పోయాడు పెద్ద కొడుకు అడవుల్లో ఉన్నాడు. భరతుడింకా రాలేదు. ఇప్పుడేం జరుగుతుందో" అనే ఉత్సాహంతో జనం ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు.



తమపిల్లలు తమని ప్రేమిస్తారని ప్రతీ తండ్రీ అనుకుంటాడు. దశరథ మహారాజు కూడా అలానే అనుకున్నాడు.  అందుకు ఆయన మీద జోకులు!! ఏం చేస్తాం మన ప్రారబ్దం!! పైన వాక్యం లో కవి దశరథుడికి తన కుమారులతో  ఉన్న అనుబంధాన్ని వివరించడం సుస్పష్టం. దానిలోని ఒక వాక్యాన్ని బయటకు తీసి రంగనాయకమ్మ తమాషా అనడం అమె ప్రవృత్తికి నిదర్శనం. తండ్రిలేని జీవితం మనిషికి అంధకారం లాంటిదని పెద్దలు చెబుతారు. అంటే దాని అర్థం ప్రపంచంలోని తండ్రులందరూ తలపైన దీపాలు పెట్టుకుని తిరుగుతున్నారని కాదు.  ఇక జనం ఉత్సాహంతో ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు అని చెప్పడం సత్యదూరం. భరతుడు రాజ్యంలోకి వచ్చేదారిలో దు:ఖమయమైన నగరాన్ని చూసి ఆందోళన చెందాడని వాల్మీకి మహర్షి రాశారు. తనకు అనుకూలంగా లేదని కాబోలు రంగనాయకమ్మ ఆ ఊసే ఎత్తలేదు. అనుబంధాలని పరిహసించే రంగనాయకమ్మ స్త్రీల గురించి అమ్మల గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం తెలుగు జాతికి పట్టిన దౌర్భాగ్యం.


మరొకటి..

తనను, సారథిని, గుఱ్ఱాలనూ రక్షిస్తూ 11వేలమంది శతృవీరుల్తో వొక్కసారిగా యుద్ధంచేసి జయిస్తాడని రుషులు రాముడిని పొగుడుతారు. అలాంటి రాముడు గంగదాటి అడవిలోకాలు మోపగానే "లక్ష్మణా! నువ్వు రాకపోతే సీతని రక్షించడం చాలా కష్టమైపొయేది. మీరిద్దరూ ముందు నడవండి. నేను వెనుక నడుస్తాను. మిమ్మల్ని వెనుక నుంచీ రక్షిస్తాను" అంటాడు. అడవుల్లో రక్షించవలసినవాళ్ళు వెనుక నడవాలా, ముందు నడవాలా??



అడవిలో ముందు నుంచీ మాత్రమే ప్రమాదాలొస్తాయనే రంగనాయకమ్మ తెలివికి లాల్ సలాం! అసలు ఇలాంటి తింగర లాజిక్కులు ఇంకెవరూ చెప్పలేరేమో.. ఒకసారి రంగనాయకమ్మ చేత ఏ తలకోన అడవిలోనో పాదయాత్ర చేయిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రమాదాలు ఏ వైపు నుంచీ వస్తాయో. ముందు టపాలో చెప్పినట్టు ఎలాగైన రాముణ్ణి కించపరచాలనే ఆకాంక్ష రంగనాయకమ్మలో బలంగా ఉంది. అందుకే ఇంత అర్థం పర్థం లేని వాదనలు చేయగలిగింది.


ఇంకొకటి..

రాముడు, సీతా, లక్ష్మణుడూ వనవాసంలో అత్రి మహాముని ఆశ్రమానికి వెళతారు. అత్రి భార్య అనసూయ మహ పతీవ్రత. వృద్ధురాలు. నెరసిన జుట్టు వొణికే శరీరం. ఆమె సీతకు పూలదండా, అంగరాగాలు ఇస్తుంది. "నా దగ్గర తపస్సు చాలా మిగిలి ఉంది. నా తపోశక్తితో నీకి బహుమానాలిస్తున్నాను. నిత్యం ఈ పూలదండ ధరిస్తే నువ్వు నిత్య యవ్వనవతిగా ఉంటావు. ఈ అంగరాగాలతో నీ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇవి ధరిస్తే యవ్వనంతో నీ భర్తకి సంతోషం కలిగిస్తావు" అంటుంది. మరి తన మాట??తనెందుకు వాటిని ధరించి నిత్యయవ్వనవతిగా ఉండలేదు?అత్రి మహాముని గారికి ఆ ముగ్గుబుట్ట తలే ఇష్టం కావున్ను!!

తన తపోశక్తితో అనసూయ సీతకు బహుమతి ఇస్తే మధ్య రంగనాయకమ్మకు బాధ ఎందుకో?? అలాంటి బహుమతులు తనకు ఎవరూ ఇవ్వలేదనా?? లేక ఎలాగైన విమర్శించాలనే తపనా? మరొక విషయం- మనశక్తిని వేరేవాళ్ళకోసం ఉపయోగించడం మనకు వాళ్ళ మీద ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని చెబుతుంది. ప్రతీ ఒక్కటి తనకు మాత్రమే కావాలనుకునే స్వార్థపు ఆలోచనలు అనసూయకు లేకపోవడం రంగనాయకమ్మకు కోపం తెప్పించాయి కాబోలు. ప్రపంచంలో అందరూ తనకు నచ్చినట్టే ఉండాలనుకునే వ్యక్తికి నిస్వార్థమైన ఆలోచనలు తమాషా అవడం అతి సహజం.

ఇవన్నీ పక్కన పెడితే ముగ్గుబుట్ట తల అని ముసలివాళ్ళను కించపరచడం - వార్థక్యం అనేది ప్రతీ మనిషికి సహజమైన దశ. దాని గురించి ఇంత నీచంగా మాట్లాడటం - మరి రంగనాయకమ్మకు రాలేదా ముసలితనం?? ఇలాంటి వ్యక్తిని ప్రజలు స్త్రీవాదిని అని, మరొకటని పొగుడుతుంటే వాళ్ళ అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేను..

1 comment:

  1. ఇదో శాపవశాత్తు మళ్ళి పుట్టిన శూర్పణఖ , వదిలెద్దురు ....

    ReplyDelete