Nov 16, 2017

బ్లాగు పాఠశాల - మొదటిభాగం

ఉపోద్ఘాతం:


"గుడ్ మాణింగ్ సర్!"
"గుడ్ మాణింగ్రా బ్లాగుపిల్లలూ, ఏమిటీ విశేషాలూ?"
"ఏమీ లేవండీ, అంతా మామూలే, రాసుకునేవాళ్ళు రాసుకుంటున్నారు, కొట్టుకునేవాళ్ళు కొట్టుకుంటున్నారూ!"
"సరే, సరే! పుస్తకాలు తియ్యండి, పాఠం మొదలెడదాం"
"పుస్తకాలేంటీ సార్? ఫేసుబుక్కా?"
"అదే, అదే! మీ బ్లాగులు తెఱవండి"
"ఏమిటయ్యా బాబీ నానీ, మొదటిబెంచిలో కూర్చుని నిద్రపోతున్నావ్?"
"వారికంతా తెలుసు సారూ! నా అక్షరారణ్యంతో వారికి పనిలేదు"
"నేనడిగిన ప్రశ్నేమిటీ, నువ్వు ఇచ్చిన సమాధానమేమిటీ? సర్లే కూర్చో. ఏమయ్యా కదిరి సురేషూ. లేవండీ! మేల్కొనండీ!! ఏనుగు సన్నివేశాన్ని చూడండీ!!! అంటూ అలా గోల చెయ్యకపోతే, కాస్త ఆ పడుకునేవాళ్ళని లేపచ్చుగా?"
"అయ్యా! నాదొక ధర్మసందేహం"
"ఎవరూ? శ్యామలరావే? అడుగు అడుగు"
"లంకపైన పడిన తోకనిస్తే ఎవరికైనా చాకిరేవు పెట్టచ్చా?"
"అబ్బే ఆ తోక తెలుగుదేశానికి చెందిన తోకైతే అస్సలు కుదరదు. ఈ విషయంలో మన శోధిని శ్రీనివాస్ ఇచ్చిన షోకాస్ నోటీసు కూడా ఏమీ పనిచెయ్యలేదు"
"మేస్టారూ, మీ దినఫలం అస్సలు బాలేదు"
"ఎవరూ? మేధా దక్షిణామూర్తా? నీ వారఫలాలు క్లేసయ్యాక చూస్కుందాం గానీ ముందు నిశ్శబ్దంగా ఉండవయ్యా!"
"బాబూ కంది శంకరయ్యా! ఏంచేస్తున్నావ్ తలొంచుకుని?"
"అదీ .. అదీ ... దొర అప్పిచ్చిన డబ్బుకు వడ్డీ లెక్కలు కడుతున్నా సారూ!"
"ఆ చేసేదేదో గద్యరూపంలో చెయ్యచ్చుగా! ఇప్పుడు చూడూ - నీ అలవాటు జిలేబీకి అబ్బి ఎక్కడ పడితే అక్కడ పద్యాలు వెదజల్లుతోంది. ఆ అలవాటిప్పుడు హరిబాబుకు కూడా అంటుకుంది"
"దొరబాబచటన్ వెడలిరి పరుగుల అప్పులకొరకట వడ్డీ లేకన్"
"అమ్మా! తల్లీ! జిలేబీ!! శాంతించు. నీ పద్యఘాయిత్యాన్ని తట్టుకోలేక అమేరికాలో జనాలు కాల్పులకు పాల్బడుతున్నారు. ఇరాన్లో భూకంపం వచ్చింది. బంగాళాఖాతంలో తుఫానొచ్చింది"
"చెల్లియో .. అక్కయో .... చెల్లకో ... పిల్లకో!"
"ఏమయ్యా హరిబాబూ, ఇది కూడా పద్యమేనా?"
"ఇది పద్యం కాదనడానికి మీదగ్గర ఆధారాలున్నాయా మేస్టారూ?"
 "నా దగ్గర వంద ఉన్నాయి మేస్టారూ!"
"ఎవరయ్యా నువ్వు? ఊరూ పేరూ లేకుండా ఊడిపడ్డావ్?"
"నేను అసలు సిసలు భారతీయుణ్ణి సార్! ఐ యాం ఏ రియల్ ఇండియన్"
"సరే అవేవో ఆ హరిబాబుకు చూపించు మరి"
"కుదరదు సార్. ఆ హరిబాబు తన బెంచి మీదున్న అంక్షలని ఎత్తేసి నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుంటేనే ఇస్తా. లెకపోతే నేనివ్వ!"
"ఇదెక్కడిగోలరా బాబూ? సరే కూర్చో. నాయనా శ్రీరాం నువ్వేంచేస్తున్నావక్కడ?"
"మన భారతీయతత్వం గురించిన హైపర్ లింకులు జనాలకి సప్లై చేస్తున్న సారూ!"
"సార్! ఈ హరిబాబూ, శ్రీరాంలు ఇలాగే ప్రవర్తిస్తే నాలాంటి రియల్ ఇండియన్ కి ఎక్కడో మండుతుంది. వీళ్ళని సెక్షన్ 007 కింద బొక్కలోకి తోయిస్తా ఖబడ్దార్!"
"ఏమిటయ్యా హరిబాబూ ఈ గోల?"
"మీరుండండి సార్. దీనికి మూల కారణం అదిగో అక్కడున్న అహ్మద్ చౌదరే. తన పుస్తకంలో మన మతం గురించి బూతులు వ్రాస్తున్నాడు. దాని గురించి తిడితే ఇదిగో ఈ ఇండియన్ ని రెచ్చగొడుతున్నాడు"
"ఏమయ్యా చౌదరీ నిజమేనా?"
"అయ్యో అంతా అబద్ధం సార్!  నాకు ఈ వ్యవసాయంతోనూ, బంకుతోనూ, ఫేక్టరీతోనూ సమయం గడిచిపోయి ఈ క్లాసులకి రావడానికి టైమే ఉండదు. ఇక ఇలాంటి పనులు కూడా ఎందుకు చేయిస్తా? కానీ ఎక్కువ మాట్లాడితే ఈ హరిబాబు మక్కెలిరగదన్నిస్తా!"
"చౌదరీ! ఈ హరిబాబు సంగతి నీకు తెలియదు. నాదసలే చెన్నై ఫీడు. నువ్వు నన్నేం పీకలేవ్. నేను రాజకీయల్లోకొచ్చి నీకు చిప్పకూడు తినిపిస్తా. నీ పుస్తకం కాపీ అల్రెడీ ఒకటి సంపాదించా.. ఏమనుకుంటున్నావ్ నాగురించి?"
"ఆపండేహే మీ సుత్తి గోలలు! వీధికూళాయి పోట్లాటల్ని ఇంటర్నేషనల్ ప్రాబ్లంస్ చేస్తున్నారు"
"హమ్మయ్య. ఆపమని ఒక్కడన్నాడు ఇప్పటికి. ఎవరు బాబూ నువ్వు? ఎప్పుడూ చూడలేదు నిన్ను?"
"నా పేరు కేతన్ సార్. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటా. అసలు ఈ స్థితికి కారణం అదిగో ఆ లాస్ట్ బెంచిలో కూర్చుని అందరికేసీ సైలెంటుగా చూస్తున్న ఆ మలక్పేట రౌడీగాడే. వాడొక పక్కా అవకాశవాది!"
"రౌడీనా? ఎక్కడా?"
"ఇక్కడ సర్!"
"వార్నీ! ఏళ్ళ తరబడి ఆ ఫేసుబుక్కు మోజులో పడి క్లాసులెగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చావా?"
"నా అంతట నేను రాలేదు సార్! ఎవరో పిలిస్తే చూసిపోదామనొచ్చా!"
"మా నాయనే! అఘోరించావ్. ఇంతకీ మన రమ్యమైన కుటీరమేదీ?"
"ఆ రౌడీగాడు దాన్ని పీకి పందిరేశాడు సార్!"
"అబ్బా! సరే! అక్కడేంటి జనాలు గుమికూడారూ?"
"పద్మార్పిత వ్రాసిన లేటెస్టు శృంగారభరిత ప్రేమకవితను ఒక డజన్ మంది ఆస్వాదిస్తునారు సార్!"
"అయ్యో అయ్యో! ఇంతకీ ఆలోచనా తరంగాలు ఎలా ఉన్నాయ్?"
"అప్సరసల కోసం పరితపిస్తున్నాయండీ"
"అయ్యబాబోయ్, వద్దులే!"
"సార్! ఈ హరిబాబు మళ్ళీ మొదలెట్టాడండీ"
"లేదు సార్! తప్పంతా ఈ అహ్మద్ దే!"
"ఆపండిరా నాయనలారా! ఆపండి మీ గోల! ఏమయ్యా కొండల్రావ్! నీ ప్రశ్నలూ జవాబులూ ఎక్కడిదాకా వచ్చాయ్?"
"సార్! పల్లెప్రపంచం ముక్కల పులుసులో బెల్లం వెయ్యాలా? పంచదార వెయ్యాలా?"
"ఖర్మరా బాబూ! ఖర్మ!"
"పిలిచారా మేష్టారూ?"
"ఎవరూ?"
"నేనండీ కష్టే ఫలిని"
"హతోస్మీ!!"

(సశేషం)