Aug 19, 2009

ఎనిమిదవ నెంబరు ప్రమాద సూచిక: "ఆస్తి" కులూ, "హేట్" వాదులూ!

.
.
.
.మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి అనుమానంగా, భయం భయంగా తొంగిచూస్తున్న వీక్షకులందరికీ మళ్ళీ కెలికాస్కారం. ఈ సారి మన ఘోస్టు విస్కాన్సిన్ విశాలాక్షి గారు. నమస్తే విశాలాక్షి.

విశాలాక్షి: అందరికీ నమస్కారం. ఏయ్ రౌడీ! విశాలాక్షి కాదు, విష అని పిలు!

మలక్పేట్ రౌడీ: "విషా" నా? అదేదో విషంలా ఉంది. అదేంపేరు?

విశాలాక్షి: నన్నేమన్నా అను .. కానీ నా పేరుని వెక్కిరిస్తే మాత్రం చీరేస్తా ఎమనుకున్నవో!

మలక్పేట్ రౌడీ: అమ్మా, తల్లీ! నువ్వు చీరేసినా, షర్టేసినా, లంగా వోణీ వేసినా, జీన్స్ వేసినా నాకెందుకుగానీ విషా అనే పిలుస్తాలే. ఇక మొదలెట్టు

విష: అలారా దారికి. ఈ సారి మన తుంటర్వ్యూ కాస్తంత వెరైటీగా ఉంటుంది. రెండూ వేరే వేరే పార్టీలతో

మలక్పేట్ రౌడీ: ఓహో! ఏదో సంవాదమన్నమాట - బహుబాగు

విష: మన మొదటి అతిధి శ్రీ శ్రీ శ్రీ శునకానంద స్వామీజీ!

మలక్పేట్ రౌడీ: ఛీ ఛీ ! వినడానికే అదోలాఉంది. ఏమిటా పేరు.

విష: ఆవేశపడద్దు రౌడి! ఆ పేరెందుకొచ్చిందో ఆయన్నే అడుగుదాం. నమస్తే శునకానందా!

శునకానంద: నమస్తే. మీ సందేహానికి మూలం మాకు అర్ధం అయ్యింది. నా పేరు మీరనుకున్నంత అసహ్యకరమైనది కాదు. ఒక కుక్క ఒక చిన్న ముద్దతో తృప్తిపడి తన యజమానికి జీవితాంతం సేవ చేసినట్టే మనం భగవంతుడిచ్చినదానితో తృప్తిపడి ఆయనకు ఆనందంగా సేవ చెయ్యాలన్నదే నా సందేశం.

విష: ఇక మా రెండవ గెస్టు చికాగో చిదంబరం గారు. ఈయనో పెద్ద హేటువాది

మలక్పేట్ రౌడీ: హేటువాది కాదు, హేతువాది. నీ అమేరికన్ ఏక్సెంట్ తగలడా! "హేటు" వాది అంటే ద్వేషపూరితమైన వాదనలు చేసేవారేమో అని అనుమానం వస్తుంది.

విష: ఏడిశావులే. నీ బుర్రకి అర్ధం కాకపోయినా జనాలకి అర్ధం అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా ఇద్దరినీ చెరో మూడు ప్రశ్నలు అడుగుతాం, ఆ తరవాత వారిలో వారే అడుక్కుంటారు. ముందుగా శునకానందుల వారికి.

మలక్పేట్ రౌడీ: భగవంతుడి పేరు చెప్పి జనాలని మోసం చేసి, ఆస్తులు కాజేస్తున్నారన్నది మీ పై అభియోగం. ఆస్తి తప్ప మరేమీ పట్టని ఆస్తికులా మీరు?

శునకానంద: పచ్చి అబధ్ధం. మేము దైవాంశ సంభూతులం. మాకు తెలియని విద్య లేదు. మా ఆశ్రమానికి రండి చూపిస్తాం. మేమే భగవంతులమని కొలిచేవారు వేలల్లో ఉన్నారు తెలుసా?

విష: రెండవ ప్రశ్న. మీరు జాతకాలు చెప్పి జనాలని మోసం చెయ్యటంలేదా? మీరు చెప్పినవేవీ నిజం కాలేదని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

శునకానంద: అసంభవం. నేను చెప్పినవి నిజమై తీరతాయి. కావాలంటే నా శిష్యులని అడగండి. జాతకాలనేవి తరతరాలుగా వస్తున్నాయి. పెద్దల మాటలు మనం విని తీరాలి. అంతా దైవ నిర్ణయం. మనం ఏమి చేసినా భవదానుగ్రహం లేనిదే ఏమి జరగదు. అలగే మనం ఏమీ చెయ్యకపోయినా శివుని దేవుడి దయ ఉంటే పనులు అవే జరిగిపోతాయ్. మనం నిమిత్త మాత్రులం. అంతా భగవంతుడే చేస్తాడు.

మలక్పేట్ రౌడీ: మూడవ ఫ్రశ్న. మీ ఆశ్రమంలో దొంగ వ్యాపారాలు సాగుతున్నాయని అభియోగం


శునకానంద: మామీద బురదజల్లే నాస్తికులకు ఇది మామూలే. ఇవన్నీ అర్ధంలేని ఆరోపణలు.

సరే, ఇప్పుడు చికాగో చిదంబరంగారికి:

విష: నాస్తిక వాద ముసుగులో కులాల మధ్య ద్వేషం రగిల్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మీ మీద అభియోగం.

చిదంబరం: అబద్ధం. నో మోర్ కామెంట్స్.

మలక్పేట్ రౌడీ: సైన్సు గురించి ఏమి తెలియకపోయినా ఎవడొ చెప్పింది విని గోల చేస్తరని మరో అభియోగం

చిదంబరం: నో మోర్ కామెంట్స్.

విష: మూడవ ప్రశ్న. మీరు చాలా త్యాగాలు చేసి ఈ పని చేస్తున్నారని పేపర్లో వ్రాశారు. దీనికి కూడ నో కామెంటా?

చిదంబరం: ఆగండాగండి. నేను చెప్పాల్సింది చాలా ఉంది

విష (స్వగతం): అమ్మ చిదంబరం! నిన్ను పొగిడితే తప్ప నువ్వు సమాధానం చెప్పవన్నమాట

చిదంబరం: ఇదంతా ప్రజల కోసం చేస్తున్నాం. పేపరు వారికి కృతజ్ఞతలు. మతం అనేది బూటకం. జాతకాలో నాటకం. అవి చాలా కీడూ చేస్తాయి. అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నాం. అసలు మతం పేరుతో అందరూ విజ్ఞాన శాస్త్రం పై దాడి చేస్తున్నారు. మన దేశ సంపదలో అత్యధిక శాతం మత సంస్థల అధీనంలో ఉంది. ఈ అజ్ఞానాన్ని పొరద్రోలడానికే మేము "జన అజ్ఞాన నివేదిక" ని స్థాపించి జనాల అజ్ఞానాన్ని ప్రద్రోలుతున్నాం. ఇంకా ...

విష (మలక్పేట్ రౌడీ చెవిలో): బుధ్ధిలేక పొగిడాను. ఇప్పుడు ఈయన ఆపట్లేదు. ఏం చెద్దాం?

మలక్పేట్ రౌడీ: ఫరవాలేదులే. ఒక బ్రేక్ ఏనౌన్స్ చెయ్యి

విష: చిదంబరంగారు. మీతో సంభాషణని కొనసాగిస్తాం కానీ ఇప్పుడో చిన్న బ్రేక్.

____________________________________________________________________________________________

వాణిజ్య ప్రకటన:

"పంకజం పిన్నీ! నీ వయసుకన్నా ఇంత చిన్నగా ఎలా కనిపిస్తున్నావ్?"

"ఏముందిలే వనజా! నా వయస్సు ఇంకా ముప్పయ్యే. ఈ గుంటూర్ శేండల్ సోప్ వాడాక "మీరే కాలేజ్?" అని అడుగుతున్నారు"

"నేను కూడ అదే సబ్బు వాడతా పిన్నీ. నువ్వే స్కూలు? అని అడుగుతారు. అరే మన మోహిని ఇటే వస్తోంది. రా రా మోహినీ, నీ సౌందర్య రహస్యం ఏమిటీ?"

"నేను వాడేది గుంటూర్ శేండల్ సబ్బు. నన్ను చూసినవాళ్ళంతా, నువ్వెప్పుడు పుడతావ్? అని అడుగుతున్నారంటే నమ్ము"


గుంటూర్ సబ్బు వాడండి. మీ వయస్సు దాయండి .. టింగ్ టింగ్ టి టింగ్

____________________________________________________________________________________________


విష: బ్రేకు దెబ్బకి తట్టుకుని ఇంకా ప్రమాదవనంలోకి చూస్తున్న వీక్షకాగ్రేసులకు పున:స్వాగతం. ఈ రౌండులో శునకానంద, చిదంబరులు ఒకరితో ఒకరు కొట్టుకుంటారు ... తప్పు తప్పు .. సంభాషించుకుంటారు.

చిదంబరం: అయ్యా! మీ జాతకాలలో రాహు కేతువుల గురించి చెప్తారు కదా. అవెక్కడ ఉన్నాయో సెలవిస్తారా?

శునకానంద: అవి పెద్దలు చెప్పిన మాటలు. గ్రహాలు కాకపోతే అవి గ్రహ స్థానాలు. అవి జీవితం పై ప్రభావం చూపుతాయన్నది మాత్రం నిజం.

చిదంబరం: ఏం ప్రభావం చూపుతాయ్?

శునకానంద: ఆశ్రమానికి రండి చెప్తాను. ఇలాంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్పడం కుదరదు.

చిదంబరం: సరే. అసలు దేవుడున్నాడు అనడానికి శాస్త్రీయపరమైన ఆధారమేమిటి?

శునకానంద: నమ్మకం. మన పెద్దవారి మాట మీద నమ్మకం. మన జగత్తు మీద నమ్మకం.

చిదంబరం: అంటే మీరు ప్రత్యక్షంగా చూడకపోయినా వారెవరో చెప్పారు కాబట్టి నమ్ముతారా? నమ్మిస్తారా? ఇది మోసం కాదా?

శునకానంద: మీరు నాకు కోపం తెప్పిస్తున్నారు. భగవదాగ్రహానికి గురవకండి.

చిదంబరం: నేణు గ్రహణం సమయంలో భోజనం చేశాను. నాకేమీ కాలేదే?

శునకానంద: ఎందుకు కాలేదు? ఆ సమయంలో భోజనం చెయ్యబట్టే మతి భ్రమించి ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. గ్రహణ సమయంలో భోజనం చెయ్యడం మతి భ్రమింపచేస్తుందనడానికి మీరే పెద్ద సాక్ష్యం. ఇక ఈ చర్చ నుండి నేణు నిష్క్రమిస్తున్నా. అందరికీ సెలవు

చిదంబరం: అంటే నేను అడిగిన ప్రశ్న ఒకదానికీ సమాధానం లేదనేగా దీనర్ధం. ఈ వ్యవహారమంతా ఎంత మోసమో ఇక్కడె తెలుస్త్గోంది.

మలక్పేట్ రౌడీ: సరే చిదంబరం గారూ! శునకానందులవారు లేరు కనక మేమే మితో సంభాషితాం. బ్రెఖ్ తరవాత

____________________________________________________________________________________________

వాణిజ్య ప్రకటన:

"అమ్మా! ఇది కంచి చీర కాదు - కేల్‌క్యులస్ చీర"

"కేల్‌క్యులస్ చీర?"

"అవును. డిఫరెన్షియేట్ చేసి చించేశాను. మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి అతికించాను"

"ఓరినీ! ఇరవైవేల రూపాయల చీర నాశనం చేశావు కదరా వెధవా!"

ఎక్సెస్ ఫీడ్ కి పిల్లలని పంపించండి - వారి అతి తెలివిని అదె ఎక్సెస్ తెలివిని పెంచండి

టింగ్ టింగ్ టి టింగ్

____________________________________________________________________________________________

మలక్పేట్ రౌడీ: రెండవ బ్రేకు దెబ్బ కూడ తట్టుకుని నిలబడ్డ ప్రజానీకానికి ఈ వసుదేవుడి పాదాభివందనం. ఇప్పుడు చిదంబరంగారికి ప్రశ్నలు.

విష: మీకు జ్యోతిషమంటే ఎందుకంత కోపం?

చిదంబరం: కోపమేమి లేదు. మూఢనమ్మకాలని, హాని చేసేవాటినీ ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఈ పోరటం.

మలక్పేట్ రౌడీ: మరి మీ కుటుంబ సభ్యులే జాతకాలు చెబుతున్నారుగా. వారి గురించి ఒక్క విమర్శ కూడా లేదెందుకు?

చిదంబరం: ................

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ! మిమ్మల్నే!!

చిదంబరం: ................

విష: (రౌడీ చెవిలో) పొగుడు, పొగుడూ!

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ, మీకు అభినందనలు.

చిదంబరం: చాలా సంతోషం. కృతజ్ఞతలు.

విష: (రౌడీ చెవిలో) ఈయనేమిటీ? దేనికి అభినందనలో చెప్పకుండానే కృతజ్ఞతలు అంటున్నారు?

మలక్పేట్ రౌడీ: ష్! ఏదో ఒకటి మాట్లాడడం మొదలయ్యింది కదా. కానివ్వు


చిదంబరం: మతం ఒక బూటకం. జాతకం ఒక నాటకం. నమ్మకం కాదు, సైన్సు ముఖ్యం. చంద్రుడీ మీద దిగిన మానవజాతి మనది. చూడకుండా దేనినీ నమ్మకూడదు.

విష: చంద్రుడి మీద దిగడం మీరు చూశారా?

చిదంబరం: నాసా వారు చెప్పారు

మలక్పేట్ రౌడీ: అయితే నమ్మెయ్యడమేనా? ఇది మాత్రం మీరన్న నమ్మకం కాదా? మీ గుడ్డి నమ్మకానికి ఆస్తికుల గుడ్డి నమ్మకాలకీ తేడా ఏముంది? నాసా వారు చెప్పారు కాబట్టీ మీరు నమ్మారు, పెద్దలు చెప్పారు కాబట్టీ వారు నమ్మారు. వాళ్ళ నమ్మకం తప్పు అనడానికీ, అదంతా మోసం అనడానికీ చాలా తేడా ఉంది. అంతెందుకూ, రేపు నాసా వారు చెప్పింది తప్పు అని రుజువయితే మీ నమ్మకమే మారుతుంది కదా?

చిదంబరం: ......

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ, మిమ్మల్నే! ఆయనెవరో సమాధానం చెప్పలేదని మీరు ఆనంద పడ్డారు, ఇప్పుడూ మీరు చేస్తున్నడేమిటీ? చూస్తూంటే వారి కన్నా మీతే పెద్ద మోసగాడిలా ఉన్నారు.

విష: రౌడీ! నోరు జారద్దు. ఈయన ఇంద్రుడి లాంటి చంద్రుడు.

చిదంబరం: కృతజ్ఞతలు. మేము పోరాడేది హానికారక సముదాయం మీద.

మలక్పేట్ రౌడీ: అయితే హానికరమైనవాటినన్నిటినీ నిషేధించాలా?

చిదంబరం: తప్పకుండా!

విష: మరి మీ నాస్తిక సంఘాల వారు బీడీలపై పుర్రె గుర్తుని ఎందుకు వ్యతిరేకించారు?

చిదంబరం: ఎక్కడ?

మలక్పేట్ రౌడీ: ఇదిగో లంకె http://living.oneindia.in/insync/soft-drinks-damage-liver-140507.html

ఆఖరి రెండు పేరాలూ చదవండి.

విష: పైగా వివక్షాపూరితమన్న కవర్ అప్ ఒకటి. వీరికి నిజాయితీ ఉంటే సిగరెట్లకి, బీడీలకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసేవారు. ఇక్కడ బిడీ కార్మికుల మద్దతు కావాలి కాబట్టీ అది హానికరమైనాసరే మద్దతిస్తారన్నమాట. ఇది మరి కుల/మత/వర్గ గజ్జి కాదా? బీడీ, సిగరెట్ల కన్నా జాతకాలు హానికరమా?

చిదంబరం: ........

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ, మీరు చేస్తున్న పనులకి మీకు భారత రత్న ఇవ్వాలి.

చిదంబరం: కృతజ్ఞతలు.

విష: (రౌడీ చెవిలో) లాభంలేదు. మనం రూటు మార్చాలి

మలక్పేట్ రౌడీ: సరే ఆ సత్యవాగ్రసాయనం తీసుకురా

విష: (రౌడీ చెవిలో) ఏమిటది?

మలక్పేట్ రౌడీ: ష్! అది తాగినవాళ్ళు ఏకధాటిగా ముప్పై సెకన్ల పాటు నిజాలు చెప్పేస్తారు. ఏప్రిల్ ఒకటి రాజేంద్రప్రసాదులా.

విష: చిదంబరంగారూ, దాహం మీద ఉన్నట్టున్నారు. ఈ జ్యూస్ తీసుకోండి.

చిదంబరం: జ్యూస్ బాగుంది. కృతజ్ఞతలు.


విష: చేపమందు విషయంలో మీ అభిప్రాయమేమిటి?

చిదంబరం: ఆ! ఏముంది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. అది బూటకమనేస్తేపోలా? వాళ్ళకి జనాలు తగ్గుతారు. మా మిత్ర బృందంలోని డాక్టర్లకు గిరాకీ పెరుగుతుంది. మా సంఘానికి ఫండింగ్ వస్తుంది. Everything is fair in business.

మలక్పేట్ రౌడీ (విష చెవిలో): ఇంకా 10 సెకన్లే ఉన్నయి.

విష: అంటే స్వామికార్యం కన్నా స్వకార్యం ముఖ్యమన్నమాట!

చిదంబరం: లేకపోతే పనిలేకుండా గోడవ చెయ్యడానికి మేమేమన్నా వెర్రివాళ్ళమా? హేతువాదులం.

మలక్పేట్ రౌడీ (విష చెవిలో): టైం అప్. ఈయన మళ్ళీ మామూలు మనిషయిపోతారు.

చిదంబరం: ఇచ్చిన అవకాశానికి సంతోషం. ఇక సెలవు.

మలక్పేట్ రౌడీ: ఈయన కూడ ఔట్!

విష: ఇందాక తెలియక అన్నా, "హేట్" వాది అన్నమాట ఈయనకి సరిగ్గా సరిపోతుంది. సరే, నీ పేరడీతో దీనిని ముగిద్దాం. అందరికీ కెలవ్!


___________________________________________________________________________________________


తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరంగు తెలిసిందిలే.
తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరూపు తెలిసిందిలే

హేతువాదమనే ఒక ముసుగుందిలే
ప్లేటుఫిరాయింపుడు లొసుగుందిలే
హేతువాదమనే ఒక ముసుగుందిలే
ప్లేటుఫిరాయింపుడు లొసుగుందిలే

ఏముందిలే, ఇక ఏముందిలే
ద్వేషాగ్ని జ్వాలల గతముందిలే,
చాలా కధ ఉందిలే!

తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరంగు తెలిసిందిలే.
తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరూపు తెలిసిందిలే
.
.
.
.